శ్రీ గురుభ్యోనమః
శ్రీ దేవీ మాహాత్మ్యము
“శ్రీ చండీ నవశతీ మంత్ర మాలా”
విజ్ఞప్తి
శ్రీ దేవీ మాహాత్మ్యము
“శ్రీ చండీ నవశతీ మంత్ర మాలా”
విజ్ఞప్తి
వేద, వేదాంగములకు పుట్టినిల్లు మన భారత దేశము. తత్త్వజ్ఞాన నిలయమైన మన దేశానికి పరదేశీయులు వచ్చి మన సంస్కృతీ వైభవానికి తలలు వంచుతుంటారు. సర్వ సృష్టికి మూలమైన ఆదిపరాశక్తి ఆరాధన మనకు పవిత్రమైనది. మనస్సుకు, వాక్కుకు అందని ఆ మాతను ఎలా ఆరాధించాలో తెలియజెప్పిన వారు ఆ మాతను దర్శించిన దేవతలు, ఋషిపుంగవులు. వారందించిన సంప్రదాయము మనకు సదా శిరోధార్యము. మన కంటికి కనిపించేది, వున్నదని వింటున్నది అయిన సకల చరాచర జగత్తు అణువు నుండి పుట్టినది. Proton, Electron అని తెలియబడే అణువులకు గల నిరంతర చలన శక్తి స్వరూపమే ఆదిపరాశక్తి. విశ్వవ్యాప్తమైయున్న అంత శ్చైతన్య శక్తి.
ఆ మాత ‘విశ్వభ్రమణకారిణి’ సృష్టి, స్థితి, లయ కార్యములు నిర్వహిస్తూ సకల ప్రాణులను మోహితులను చేసి సంసారమనే సుడిగుండము లో పరిభ్రమింప జేస్తుంటుంది. అలాగే ఆ తల్లిని ఆరాధించి ఆమె కరుణకు ఎవరు పాత్రులవుతారో వారికి ఆ బంధవిముక్తి ద్వారా మోక్షప్రాప్తినిస్తుంది జగన్మాత
తేజో రూపి అయిన ఆమెయే ఓంకారము. సకల దేవతా మూర్తులు సర్వ మంత్ర, యంత్ర, తంత్రములు ఆమె స్వరూపములే. మనము ఏ దేవతామూర్తిని ఆరాధించినా ఆమెను పూజించినట్లే. సకల వాఙ్మయము, సకల కళలు, సృష్టిలోని అన్ని స్త్రీమూర్తులు ఆ పరదేవీ రూపాలే. పశు,పక్ష్యాదులకు కూడా అన్వయమయే ధర్మము కాబట్టే ఈ మాతృత్తత్వమును మనము ఆరాధిస్తాము. మన సంప్రదాయములో “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః “ స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు వసిస్తారని వున్నది. స్త్రీమూర్తికి మాతృత్వమనే దివ్యశక్తి వున్నందువల్లనే ఆమెను అంతటి విశిష్ట శక్తిగా మనము గుర్తించాము. ఇది మరి ఏ ఇతర దేశాల్లోనూ ఇది కానరాదు.
మన పరిశీలనలో విశ్వమంతా పంచభూతాత్మకము, సాత్విక, రాజస తామసము లనే త్రిగుణాత్మకముగా గోచరిస్తుంది. భగవద్గీతలో ఇలా వున్నది.
“యజన్తే సాత్వికా దేవాన్యక్ష, రక్షాంసి రాజసాః |
ప్రేతాన్భూత గణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||”
జగన్మాతను సాత్వికులు “పరాపరాణాం పరమా ” “ ప్రణవ స్వరూపిణి”గా ఆరాధిస్తారు. వారికి అహింస, శాంతము, కరుణార్ద్ర హృదయము, నిష్కల్మషత భగవచ్చింతన సాధు ప్రవృత్తి వుంటాయి. పర దేవిని రాజసులు యక్షిణి, రాక్షసిగా పూజిస్తారు. స్వార్థ చింతన, దురహంకారము కామక్రోధాదులు వారి లక్షణములు. ఇక జడత్వము,అతినిద్ర, హింసాప్రవృత్తి, అతికాముకత, పాపభీతిలేని తామస గుణములున్నవారు విశ్వమాతను ఒక భూతము, ప్రేతమని భావిస్తూ ఆరాధిస్తారు అని తాత్పర్యము.
త్రిమూర్తుల కే తల్లి అయిన ఆమె అవతారాలు అనేక రూపాలుగా ఆయా సందర్భాలను అనుసరించి ఉంటాయి. ఆ తల్లికి అనేక నామములు శ్రీ లలిత, సరస్వతి, గౌరీ, లక్ష్మి ఇత్యాది ఎన్ని పేర్లున్నా ఆమె ఒక్కతే. ఆమెను మించిన మరొక అమ్మ లేదు.ఆ మాతను “అతి సౌమ్యాతి రౌద్రాయై” అని పురాణములో నుతించారు. పరమ శాంత కారుణ్య రూపిగా భక్తులకు, దుష్టులకు మాత్రమే భయంకర రూపిగా కనిపిస్తుంది ఆమె.జ్ఞానులు ఆ మాత శాంత స్వరూపాన్ని దర్శించే భాగ్యము కొరకు నిరంతరము ధ్యానిస్తుంటారు .రాజస, తామస గుణులు మాత్రమ ఆమె రౌద్రరూపాన్ని పూజించటానికి అపేక్షిస్తారు. ఉహించటానికే వీలులేని ఆ తల్లి రౌద్రరూపాన్ని దేవతలే చూడలేరు. - మనమెంత?
ఆ దేవికి వారు మద్య, మాంసాది పంచమకార సేవలు అర్పిస్తూ “ అజ్ఞానమును జ్ఞానముగా” మాయచేసి చూపే వారినే తాంత్రికులంటారు. కేవలము మత ప్రచారం కొరకు వారు “దేవిని పై విధముగానే అర్చించాలి. లేకపోతే ఆ తల్లి భక్తులను జపించి సర్వ నాశనము చేసి మ్రింగుతుంది” అనే “మహా భీతిని” ప్రజలలో కలిగించారు. అప్పటి నుండే వారివల్లనే శ్రీ దేవి ఆరాధన అంటేనే భయానికి లోనవుతున్నారు జనము. దేశమంతా ఇదే స్థితి. దేవిని ఈ విధంగా భావించటము మహా క్షేత్రాలలో గోచరిస్తున్నది. కాలప్రభావము వలన “జ్ఞానద”, “మోక్షద” అయిన తల్లి ప్రజలలో క్రూర తామసీ శక్తిగా భావింప బడుతూ ఆమెకు శాంత రూపము మరియు పరంపరాగతమైన పూజలు తెరమరుగై తాంత్రిక పూజలు అవతరించాయి.
వాని ఫలితములే స్వార్థ చింతన, లంచగొండితనము, పరధన వ్యామోహము, స్త్రీలను చులకనగా చూచి అవమానము చేయుట, తుచ్ఛ వస్తువులకై హింసాప్రవృత్తి, అలా కోటితలలు ధరించిన దుర్మార్గస్థితి అన్ని విషయాలలో విలయ తాండవం చేస్తున్నది. వీనిని అదుపు చేయగల శక్తి నేడు అత్యవసరము. ప్రజల హృదయాలలో సంపూర్ణముగా మార్పు వస్తేనేగాని ఈ దుస్థితి తొలగిపోదు. ప్రపంచానికి శాంతి లభించదు.
భవాని, భవతారిణి అనుకుంటూనే వెనుక హృదయంలో “ఈ దేవి రుధిరాక్తేన బలినా మాంసేన, సురయా ఆరాధింపబడేది” అని ఆ తల్లిని చెడుగా భావించటము “ శ్రద్ధ” శబ్దార్థానికి, సత్సం ప్రదాయానికి చేసే అపచారము.
తాంత్రికులు ప్రధానముగా శ్రీపరదేవీ పేర్లలో ఒకటైన “చండి” పేరును ఎంచుకొని ఆమె నిర్వహించిన మహిషాసురాది రాక్షస వధలను తాంత్రిక మత ప్రచారానికి ఉపయోగించుకున్నారు.అమ్మలకు అమ్మ, సర్వదేవతా స్వరూపిణి అయినా చండీ పర దేవీ నవాక్షర మూలమంత్రార్ధము ఆమెను అఖండ బ్రహ్మ విద్యగా అభివర్ణిస్తున్నది. కానీ ప్రజల మనస్సులలో ఆమె క్రూర తామసీ శక్తి. ఇది చాలా విచిత్ర స్థితి. జన్మతనే సదాచార పరులైన శ్రీ శ్రీ శ్రీ గోపానందనాథ గుర్వాజ్ఞ పై దేశమంతా తిరిగి పలు క్షేత్రాలలో ఆది పరాశక్తి పై ప్రబలిన మహా భీతిని, సంప్రదాయ ఆరాధన వక్రీకరింపబడిన పరిస్థితిని గమనించారు.
సంప్రదాయ శ్రీదేవి ఆరాధనను పునరుద్ధరించటానికై ఆయన చేసిన సుదీర్ఘ కృషి ఫలించి శ్రీ మార్కండేయ మహా పురాణాంతర్గత “ శ్రీ దేవి మహత్య” చరిత్ర శ్లోకాలను శాస్త్రోక్తముగా 921 మంత్రములు గా విభాగము చేయించి “ శ్రీ చండీ నవశతీ మంత్ర మాల“గా దశాబ్దాల క్రితమే ప్రచురించి ప్రచారము చేశారు. నవశతీ సంఙ్ఞ పురాకల్పే వున్నట్లు వామకేశ్వర తంత్రము పేర్కొంటున్నదని జగద్గురు వాక్యము. శ్రీదేవి మూల తత్వమును ప్రశంసించే ఆ గ్రంధము తదాదిగా భయహారిణి, జ్ఞాన దీపికగా అవతరించి యున్నది. సర్వజగత్తుకు సుఖ శాంతులను ఆపేక్షించే ఈ పవిత్ర గ్రంథము ద్వారా శ్రీదేవిని అందరూ భీతి వదలి, సాత్విక పద్ధతిన ఆరాధించవచ్చునని ప్రబోధిస్తున్నది. తమ పిన్నవయసులోనే పూర్ణ దీక్షితులై మంత్రము, మంత్ర ప్రభావముల గురించి పూర్ణ ఙ్ఞానియైన శ్రీ శ్రీ శ్రీ గోపానంద ప్రబోధన.
- కల్పాదిగా ఆరాధింపబడే శ్రీ దేవి మహాత్మ్యము “నవశతీ” విధానముశ్రేష్ఠమైనది, సత్సంప్రదాయ బద్ధమైనది.
- “ నవో నవో భవతి” శృతి వాక్య ప్రమాణముగా నవసంఖ్య దేవీ స్వరూపమే “పరాపరాణాం పరమా అయిన ఆ దేవీ వలెనే నవ సంఖ్యకు మించిన సంఖ్య లేదు.
- నవదుర్గలు, నవ భూతములు, నవ కోణములు, నవావరణలు - ఇత్యాదిగా నవ సంఖ్య శ్రేష్ఠ వాచకము.
“ ఏకై వాహం జగత్యత్ర ద్వితీయా కా మమా - పరా” అని దేవియే పలికినట్లు శ్రీదేవిని జగన్మాతగా భావిస్తూ చేసే సాత్వికారాధనయే శ్రేష్టమైనది.
మానవుని జీవిత ధ్యేయము మోక్షము. ఆ పరమ పురుషార్థ సాధన జ్ఞానము వల్లనే సాధ్యము. “సత్వాత్సంజాయతే జ్ఞానమ్” జ్ఞాన దేవతు కైవల్యమ్ “ అని స్మృతి వాక్యము ఉన్నందున సాత్వికత జ్ఞానమునకు మూలము. జ్ఞానము వల్లనే మోక్షము. అందుచేతనే సాత్విక తత్వమే సదా ఆరాధనీయము.
“అహింసా పరమోధర్మః” సర్వకాల సర్వావస్థల యందు అహింసా వ్రతము ను పాటించేవారి సన్నిధిలో శాంతి దేవత నివసిస్తుంటుంది . “అహింసా ప్రతిష్ఠాయాం తత్సన్నిధౌ వైరత్యాగః “ పశుపక్ష్యాదులు కూడా అహింసా వ్రత ప్రభావము వలన జన్మతఃనే సంక్రమించే సహజ వైరములు మరచి పరస్పరము సఖ్యతతో మెలుగుతాయి. ఇక మనిషికి అది అసాధ్యం కాదు. “ న క్రోధో నచ మాత్సర్యం న లోభో నాశుభామతిః” అని శృతి బోధిస్తున్నది. మానవత్వమును నిలుపుకొనుటకు అదే మనకు శిరోధార్యము.
తమలోని రాజస, తామస గుణాలను సాధన ద్వారా నిగ్రహించుకుని, సత్వగుణ ప్రధానమైన జీవితము గడిపిన వారికే భగవత్కరుణ లభిస్తుంది. భక్తి, వేద, వేదాంగములపైన శ్రద్ధ, అపార నమ్మకము, విశ్వాసము, ఆత్మ నివేదనలతో చేసే దేవీ పూజలు సనక , సనందాది ఋషుల ద్వారా పరంపరగా మనకు లభ్యమైనవి. అంతర్యాగ బహిర్యాగములైన అలాంటి పూజల ద్వారానే ఆత్మ దర్శనము, భువన శాంతి లభ్యమవుతుంది. ఆ విధానమునే సమయ, దక్షిణాచార శ్రీదేవి ఆరాధనంటారు.
ఆదిశక్తి నిత్య చైతన్య రూపిణి. ఆమెను “శివా శివ శక్యైక్య రూపిణి, శ్రీ లలితాంబికా” అని స్తుతించారు. శివ శక్యైక్య సామరస్య పరతేజమే ఆ దేవి. నామ, రూప లింగ భేద రహితమైన ఆశక్తి దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు మాత్రమే దేవ కార్యార్థమై అవతరిస్తుంది. శ్రీ లలిత వేరు, చండి వేరు అనుకొని జగన్మాతను గురించి సంశయాత్ములై విరుద్ధ భావనలు చేయక భయము వదిలి పెట్టి ఆ తల్లిని భక్తిశ్రద్ధలతో సాత్విక సంకల్పము చేసి, సాత్విక మంత్రములతో, సాత్విక పూజా ద్రవ్యములతో ఆరాధించండి. శుభములు కలుగుతాయి.
శ్రీదేవీ ఆరాధన ఫలశృతిలో “కాల స్వరూపిణి” అయిన జగన్మాత జనులను రోగాది సర్వ బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. ప్రపంచమంతా వ్యాపించి యున్న అహంకారము, పరస్పర ద్వేషస్థితి, మత్తెక్కిన మత ద్వేషాలు, హద్దు లేని ధన దాహము, వయస్సు, వావివరసలు చూడని అతి కామప్రవృత్తి, ఇత్యాదులన్నీ నశించి సంఘములో సుఖశాంతులు వర్ధిల్లుతాయి.
తాంత్రిక పూజల జోలికి పోయి లేని ఆపదలు కొని తెచ్చుకోవద్దు. ఆపదలు ఏ రూపంలో ఉన్నా “దుర్గే” అని ఆ మాతను స్మరిస్తే అవి తొలగిపోతాయి . శ్రీదేవీ ఆరాధనను అందరూ వారివారికి సూచించిన సంప్రదాయానుసారముగా చేయవచ్చునని భవిష్యోత్తర పురాణము.ముఖస్తుతులు, కపట వేషాలు నిరసించే శ్రీ గురు దేవులు “ చండీ” అంటేనే కలిగే మహా భీతిని నిరసించి, వీర ధైర్యముతో సాగించిన పై సంస్కరణ పలువురు ప్రశంసలందుకొన్నది. వారు ఆశించిన మార్పు ప్రజలలో గోచరించిన నాడు శాంతి లభిస్తుంది. జ్ఞానార్థులై సర్వులూ జగన్మాతను భజించి సుఖశాంతులు పొందగలరు.
|| సర్వేజనా సుఖినోభవంతు||
శ్రీ గోపానంద నాథులు (1907-2003)
శ్రీ గోపానంద నాథులు (1907-2003)